నిన్న నేను వ్రాసిన టపాలో జంధ్యాలగారిని గూర్చి వ్రాయటం ఎలా మరిచిపోయానో అర్ధం కావటం లేదు. కె. విశ్వనాథ్ గారి గూర్చి వ్రాస్తూ జంధ్యాల గారిని గూర్చి వ్రాయలనుకుంటూనే సినిమా లోకం నుంచి సినిమేతర లోకంలోకి వెళుతూ మరిచిపోయాను. ఇది కూడా ఒకందుకు మంచినే చేకూర్చింది. ఆ టపాకు రెండవ శీర్షకను వ్రాసే అవకాసం నాకు దొరికింది.
మొదట హాస్య బ్రహ్మ జంధ్యాల గారిని గూర్చి వ్రాయాలి. అచ్చ తెలుగులో అందరిని కడుపుబ్బా నవ్వించడం అయానకే చెల్లింది. "అసలు నేను తాజ్ మహల్ ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా!" ప్రేక్షకులను నవ్విస్తూనే ఎన్నో సున్నితమైన విషయాలు తెలియచేస్తూ, సామాజిక స్పృహతో కూడిన చిత్రాలను వారు తీసారు. అందుకు తెలుగుజాతి వారంతా ఆయనకు ఋణగ్రస్తులు. వారు 50 ఏళ్లకే స్వర్గస్తులవటం తెలుగు సినీ లోకానికి, ముఖ్యంగా హాస్య లోకానికి తీరని నష్టం కలిగించింది.
జంధ్యాల పేరు వచ్చింది కాబట్టి కరుణశ్రీగా ప్రఖ్యాతి గాంచిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని, వారి పుష్ప విలాపంని ఇక్కడ స్మరించ తలిచాను.
ఈ మధ్య కాలంలో వచిన్న సినీదర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాసుగారు, శేఖర్ కమ్ములగారు, శ్రీను వైట్ల నాకు చాల ఇష్టం. అదే విదంగా జాగర్లముడి రాధాకృష్ణ, దేవ కట్ట వంటి వారంటే కూడా నాకు చాలా అభిమానం. అదే విధంగా పాటల రచియిత అనంత్ శ్రీరాం కూడా నాకు మిక్కిలి మక్కువ.
నేను స్కూల్లో ఉన్నప్పుడు అష్టావధానం గూర్చి ఒక పాఠం చదువుకున్నాను. అవధానం అనే సాహిత్య ప్రక్రియ సంస్కృత, తెలుగు భాషలలోన మాత్రమే విస్తృతంగా ఉనట్టు ఉంది/ఉండేది. ఇందులో అష్టావధానం చాలా విరివిగా ఉన్నప్పటికీ మనకు శతావాధనులు, సహస్రావధానులు కూడా ఉన్నారు/ఉండేవారు. తిరుపతి వెంకట కవులు అష్టావధానానికి బాగా ప్రాశస్త్యం తెచ్చినట్టు నాకు ఈ రోజు తెలిసింది. నాటక రంగంలో "బావా ఎప్పుడు వచ్చితివి?...", "జెండాపై కపిరాజు..." వంటి పద్య రత్నాలు వారు ఇచ్చారనే విషయం మాత్రమే నాకు ఇదివరకు తెలుసు.
ఇంకా ఎందరో మహానుభావులు. నాటి ఆదికవి నన్నయనుంచి నేటి తరం వారి వరకు తెలుగు భాషకు వన్నె తెచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ శతసహస్రవందనాలు.